హరియాణా నుంచి భారీగా దిగుమతి.. ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయం


హరియాణా నుంచి భారీగా దిగుమతి..

ఎమ్మార్పీ కన్నా అధిక ధరకు విక్రయం

గుజరాతీ, రాజస్థానీ దుకాణదారుల నిర్వాకం!


 దృష్టి సారించిన ఆహారకల్తీ నిరోధక శాఖ, సీసీఎస్‌ పోలీసులు


జగిత్యాల, : అదొక ప్రముఖ బ్రాండ్‌ గోధుమ పిండి. హరియాణాలో దాని ధర కిలో రూ.40. అదే మన రాష్ట్రంలో అయితే రూ.57. హరియాణాలో అమ్మకానికి ఉద్దేశించిన ప్యాకెట్లపై.. ఆ పిండిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు (ఒక్కమాటలో చెప్పాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో) విక్రయించకూడదని స్పష్టంగా ఉంటుంది. కానీ, ఆ గోధుమ పిండి ప్యాకెట్లను ఇక్కడి రేట్లతో బిల్లులు ఇవ్వకుండా అమ్మేసే దందా జగిత్యాల జిల్లాలో జోరుగా సాగుతోంది. హరియాణాలో తక్కువ ధరకు లభించే ప్యాకెట్లను కొనుగోలు చేసిన వ్యాపారులు జగిత్యాల, సిరిసిల్ల తదితర జిల్లాలకు తరలించి ఇక్కడి ధరలకు విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా రాజస్థాన్‌, గుజరాత్‌కు చెందిన వ్యాపారుల దుకాణాల్లో బిల్లులు ఇవ్వకుండా ఈ గోధుమ పిండి విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం.


ఈ నెల 10న జగిత్యాలలోని పలు దుకాణాల్లో సీసీఎస్‌ పోలీసులు, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించి.. నిల్వ ఉంచిన పలు గోధుమ పిండి బస్తాలను స్వాధీనం చేసుకోవడంతో ఈ వ్యవహారం బయట పడింది. తెలంగాణలో విక్రయించడానికి అనుమతి లేని గోధుమ పిండి ప్యాకెట్లను నిల్వ ఉంచిన మూడు దుకాణాలను సీజ్‌ చేశారు. ఇవి ప్రముఖ బ్రాండ్‌ పేరుతో విక్రయిస్తున్న నకిలీ గోధుమ పిండి అనే అనుమానాలూ వ్యక్తమవుతున్న నేపథ్యంలో నమూనాలను ల్యాబ్‌కు పరీక్షల నిమిత్తం పంపారు. ప్రముఖ బ్రాండ్‌ పేరుతో నాసిరకం గోధుమ పిండిని విక్రయిస్తున్నారా? లేక ధరల్లో వ్యత్యాసంతో జీరో విక్రయాలు జరుగుతున్నాయా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.


అధికారులకు అప్పగించాం

జగిత్యాలలో అనుమతి లేని గోధుమ పిండి ప్యాకెట్లు విక్రయిస్తున్నారన్న సమాచారంతో ఇటీవల పలు దుకాణాల్లో సోదాలు చేశాం. తెలంగాణలో విక్రయించకూడదని ముద్రించి ఉన్న ప్యాకెట్లు నిల్వ ఉంచడాన్ని గుర్తించాము. ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారులకు సమాచారం అందించి వారికి అప్పగించాం.


 ఆరీఫ్‌ అలీఖాన్‌, సీఐ, సీసీఎస్‌, జగిత్యాల


పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపాం

జగిత్యాలలో నిల్వ ఉంచిన ఒక ప్రముఖ బ్రాండ్‌ గోధుమ పిండి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నాం. పిండిలో నాణ్యత, కల్తీని గుర్తించడానికి నాచారంలోని ల్యాబ్‌కు పంపాం. ఫలితాలు వచ్చిన అనంతరం చర్యలు తీసుకుంటాం. పన్ను ఎగవేత, జీరో వ్యాపారం, బిల్లులు లేకుండా జరిగే వ్యాపారం మా పరిధిలోకి రాదు. వాణిజ్య పన్నుల శాఖకు సమాచారం అందిస్తాం.


అనూష, ఇన్‌చార్జి, ఆహార కల్తీ నిరోధక శాఖ అధికారి, జగిత్యాల

Comments

Popular posts from this blog

అందరం ప్రార్థిద్దాం.. అతను బతకాలని, సోనూ సూద్ పిలుపు